హైదరాబాద్ శివార్లలో సినిమా సిటీ నిర్మాణం

హైదరాబాద్ సిటీ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు, ఇందుకోసం 1,500 నుంచి -2,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని సీఎం  తెలియ జేశారు. సినీ ప్రముఖులు, ఆఫీసర్ల టీమ్​ బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన చెప్పారు. అన్ లాక్ ప్రారంభమైనందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు ఓపెన్​ చేసుకోవచ్చన్నారు. సినీ నటులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫిల్మ్​ ఇండస్ట్రీ అభివృద్ధి-, విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ అని అన్నారు. షూటింగులతో పాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుందని, ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మించాలనే ఆలోచనతో ఉందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం 1,500 నుంచి -2,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుందని, ఇందులో మోడ్రన్​ టెక్నాలజీతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుందని చెప్పారు. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.