అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన ప్రణీత

అయోధ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. దీంతో, రామ భక్తుల నుంచి ఆలయ ట్రస్ట్ విరాళాలను సేకరిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలను అందజేశారు. మరోవైపు సినీ నటి ప్రణీత కూడా విరాళాన్ని ప్రకటించారు. మందిర నిర్మాణం కోసం తన వంతుగా లక్ష రూపాయలను ఇస్తున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరాళాలను అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.  సినీ పరిశ్రమ నుంచి రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించిన తొలి వ్యక్తి ప్రణీత కావడం గమనార్హం. కరోనా సమయంలో కూడా ప్రణీత ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి, తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.