ఆర్టీసి కీల‌క నిర్ణ‌యం: ఉద‌యం 4 గంట‌ల నుంచే సిటీ స‌ర్వీసులు…

కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్‌ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ.ముందుగా సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల నుంచి కూడా వేకువజామునే బస్సులుండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణించి రద్దీని అంచనా వేసి అవసరమైన మేరకు బస్సులను పెంచే చర్యలు చేపట్టారు.

హయత్‌నగర్‌- కోఠి మధ్య అదనంగా 12 సర్వీసులు..

నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటలకే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు బయలుదేరుతున్నాయని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు. హయత్‌నగర్‌, ఫలక్‌నుమా, హెచ్‌సీయూ, మియాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం డిపోల నుంచి కూడా వేకువజామునే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. గతంలో మాదిరే అన్ని బస్సు సర్వీసులను వేకువ జాము నుంచి అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. రాత్రి కూడా 10 గంటల వరకూ వాటికి షెడ్యూల్‌ వేశామన్నారు. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అనువుగా ఉండేందుకు టీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులను పెంచింది. హయత్‌నగర్‌-కోఠి మధ్య రోజూ తిరిగే బస్సులకు అదనంగా మరో 12 సర్వీసుల(రూటు నంబరు 299)ను అందుబాటులోకి తీసుకు వచ్చామని హైదరాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న చెప్పారు. బుధవారం నుంచి అదనంగా బస్సులను నడుపుతున్నామన్నారు.