*పుష్కరాల దృష్టిలో ఎమ్మెల్యే బత్తుల పలు సూచనలు
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ సమగ్ర అభివృద్ధిపై వివరాలు వెల్లడించారు. రూ.58.72 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, షాదిఖానాలు వంటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అలాగే, విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం అదనపు స్తంభాలు, త్రీ-ఫేజ్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అమృత్ 2.0 కింద ఈ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. ఇక గ్రామ చెరువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోరుకొండ, రాజానగరం మండలాల్లోని అనేక చెరువులను నడక ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల పార్కులతో అభివృద్ధి చేయాలని వివరించారు. ఇది పర్యావరణ పరిరక్షణతోపాటు స్థానికుల ఆరోగ్యకర జీవనశైలికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని, రాజానగరం నియోజకవర్గం – ముఖ్యంగా సీతానగరం మండలంలోని ఘాట్లను మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని కోరారు. యాత్రికులకు అవసరమైన వసతి, రోడ్డు, భద్రత, దేవాలయాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పుష్కరాల సందర్బంగా విపరీత రద్దీకి ముందస్తు ఏర్పాట్లు అత్యంత అవసరమని, ఈ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Share this content:
Post Comment