తెరిచిన స్కూళ్లు మూసివేత!

లాక్ డౌన్ అనంతరం ఇటీవలే నవంబరు 2 నుంచి దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా ప్రొటోకాల్‌ను పాటిస్తూ పాఠశాలలను తెరిచారు. అయితే ఇలా స్కూళ్లు తెరిచిన వారం రోజుల వ్యవధిలోనే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలోని స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే తెరిచిన స్కూళ్లను తిరిగి మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఒడిశాలో కరోనా సెకెండ్ వేవ్‌పై అనుమానంతో ప్రభుత్వం పాఠశాలలను తెరవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 92 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలను నవంబరు 25 వరకూ మూసివేయాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేసే 80 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో వెంటనే స్కూళ్లను మూసివేశారు. విధులలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. మిజోరంలో అక్టోబరు 16న పాఠశాలలు తెరవగా, కొద్ది రోజుల్లోనే పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అక్టోబరు 25నుంచి తిరిగి స్కూళ్లను మూసివేశారు. ఇక అసోంలో నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరిచారు. అయితే కరోనా ముప్పు భయంతో స్కూళ్లను తిరిగి మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు.