తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే…

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,కడప జిల్లాలో వర్ష ప్రభావాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు నీటమునిగిపోయాయి.

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం(నవంబర్ 27) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా దాదాపు 40వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. డిసెంబర్ 15 లోగా పంట నష్టాన్ని అంచనా వేసి… పంట దెబ్బతిన్న రైతులకు డిసెంబర్ నెలాఖరులోగా పరిహారం అందించాలని నిర్ణయించారు. అలాగే నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని నిర్ణయించారు. భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.