దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగి పడిన నేపథ్యంలో  కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవ్వగా.. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.  అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.