బాధతులను పరామర్శించనున్నసీఎం జగన్.. వింత వ్యాధి పై కీలక సమీక్ష

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మందికి పైగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఏలూరులో స్థానికులు వింత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం కానున్నారు. అస్వస్థతకు కారణాల పై అధికారులతో సమీక్షించనున్నారు.

ఇప్పటికే సీఎం ఆదేశాలతో మంత్రి నాని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో స్థానిక పరిస్థితులపై గవర్నర్‌ ఆరా తీశారు.