ఉద్యోగులకు సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కానుక

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ ఆదివారం ప్రగతి భవన్‌కు చేరిందని సమాచారం. ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపుపై కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

అటు వచ్చే ఆర్ధిక సంవత్సరం(2021-22) ప్రారంభం అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందించనున్నట్లు సమాచారం. అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపులపై కూడా సీఎం కేసీఆర్ ముఖ్య ప్రకటన చేసే అవకాశం ఉందట. కాగా, 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కమిటీ గడువును రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సార్లు పొడిగించగా.. చివరిసారిగా గతేడాది ఫిబ్రవరి 18న పొడిగించింది.