ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం 33 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ విడతలో రూ. 33 లక్షలు మంజూరు కాగా, గత 9 నెలల్లో మొత్తం 72 లబ్దిదారులకు రూ. 1 కోటి మంజూరైంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకునే వారికి, వివిధ ఆపరేషన్ల కోసం ముందస్తు వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేలా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ క్రమంలో, ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధర్మరాజు చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే అది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా చూడటం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. లబ్దిదారుల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి, స్వల్పకాలంలో నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల, గ్రామా జనసేన & టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment