యాసంగి పంట సాగు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

పంటలను విక్రయించడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవద్దని భావిస్తున్న కేసీఆర్‌ వరుస సమీక్షలతో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో.. యాసంగి పంటసాగు విధానం, పంట కొనుగోలుపై కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

వేసవిలో పండిన పంటల్ని గ్రామాల్లోకే వచ్చి రైతుల దగ్గర ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. ఆ దిశగా యాసంగి పంట సాగు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నదని, దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, శనివారం నాటి సమావేశంలో ఈ అంశంపైనా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కరోనా ముప్పు ఇంకా తొలుగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు.. అలాగే వానకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లుచేయాలన్నారు. పంట కొనుగోళ్ల తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బు చెల్లించాలి. దీనికోసం కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.