హాస్యనటుడు వివేక్ కన్నుమూత.. వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు వివేక్ ఈ తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. గురువారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ నిన్న ఉదయం శ్వాస ఆడడం లేదని చెబుతూనే తన ఇంట్లో కిందపడి స్పృహ కోల్పోయారు.

దీంతో ఆయనను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వివేక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆరేళ్ల క్రితం డెంగీ జ్వరంతో ఓ కుమారుడు మృతి చెందాడు.

తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితమైన వివేక్ టీవీ హోస్ట్‌గా అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్ వంటి వారిని ఇంటర్వ్యూలు చేసి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే వివేక్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా దక్కింది. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ రక్షణకు మద్దతుగా వివేక్ పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాట అగ్రహీరోలైన రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్, ధనుష్ తదితర హీరోలతో కలిసి ఆయన నటించారు. వివేక్ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రకాశ్ రాజ్, ఖుష్బూ, నివీన్ పాలి వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు.

నా స్నేహితుడు వివేక్ ఇంత త్వరగా వదిలి వెళతాడని ఊహించలేదు. ఆలోచనలు మరియు చెట్లను నాటినందుకు ధన్యవాదాలు. మీ తెలివి తేటలు, కామెడీతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లెజెండ్ ఇక లేరని నమ్మలేకపోతున్నాం. మీతో పని చేసిన క్షణాలు ఎప్పుడు మా మదిలో నిలిచి ఉంటాయి. కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను – మోహన్ రాజా

వివేక్ లేడనే వార్త పెద్ద షాకింగ్. ఎంతో చురుకైన వ్యక్తి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. మీరు ఉన్నన్ని రోజుల మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు కన్నీళ్లు, బాధలను మిగిల్చి వెళ్లారు అంటూ ఖుష్బూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది.

గురువారం చెన్నైలోని ఓమాండురార్‌ ఆసుపత్రిలో వివేక్‌ కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అంతలోనే ఆయన మృతి చెందారన్న వార్త అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది.