పోలీసులకు పూర్తి స్వేచ్ఛ .. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే కఠినచర్యలు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని అరాచకం చేయాలనుకునే మతోన్మాదులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకు రాజధాని హైదరాబాద్‌లో  శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలను సాగనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొన్నారు. అరాచకశక్తుల కుట్రలపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నదని..శాంతిభద్రతలను కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొనే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని  సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు.

ఈ సమావేశంలోపాల్గొన్న సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ కొంత మంది సోషల్ మీడియాలో ప్రజలకు లేని పోని అపోహలు కల్పిస్తున్నారని ప్రజల్లో అశాంతిని రేకెత్తించడం వంటివి చేస్తున్నారని సీపీ అన్నారు. నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని తెలిపారు. ఏడేండ్లలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు బాగుతున్నాయనీ, నేరాలు అదుపులో ఉండడంతోపాటు మత ఘర్షణలకు తావులేదని స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఫేక్‌న్యూస్‌తో వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతతను భగ్నం చేసి మతసామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నగర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అందరు కృషిచేయాలని అంజనీకుమార్ కోరారు.