కాశీబుగ్గ ఎస్ఐ శిరీషకు విజయశాంతి అభినందనలు!

ఓ అనాధ శవాన్ని తన భుజాలపై కిలోమీటర్ దూరం మోసిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్ స్పెక్టర్ కొత్తూరు శిరీషపై నటి, బీజేపీ నేత విజయశాంతి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్ట్ ను పెట్టారు. తాను నటించిన ‘కర్తవ్యం’ చిత్రం నుంచి పొందిన ప్రేరణతో తన కుమార్తెను ఎస్సైని చేశానని శిరీష తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పడాన్ని విజయశాంతి ప్రస్తావించారు.

“నేను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం నాకెంతో ఆనందం కలిగించింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు అభినందనలు..” అని ఆమె పేర్కొన్నారు.