‘నేతాజీ’ గ్రంథ రచయిత శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి కి అభినందనలు

• మన స్వేచ్ఛ కోసం త్యాగాలు చేసిన వీరుల చరిత్ర అందరికీ తెలియాలి

స్వతంత్ర భారతావని కోసం వీర మార్గంలో పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా భారతీయులు ఆయుధాలతోనూ పోరాడగలరని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటారన్నారు. ఆ ధీశాలి సంగ్రామ చరిత్ర ఎంత మహోజ్వలమైనదో తెలియచెప్పే ‘నేతాజీ’ గ్రంథాన్ని రచించిన ప్రముఖ రచయిత, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే ఎందరో వీరులు స్వతంత్ర పోరాటంలో తమ ఊపిరిని తృణప్రాయంగా వదిలారు. అటువంటి ధీరోదాత్తుల పోరాటపటిమ… వారి అచంచలమైన దేశభక్తిని నవతరానికి… భావి తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ బాధ్యతతోనే నేతాజీ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శాస్త్రి లో ఉన్న జాతీయవాద దృక్పథం ప్రశంసనీయమైనది. ఈ గ్రంథావిష్కరణకు నేను హాజరవ్వాల్సి ఉంది. ఇతర షెడ్యూల్స్ వల్ల సాధ్యం కాలేదు. మరో ప్రత్యేక సందర్భంలో ఆయనను కలుస్తాను.

‘నేతాజీ’ పుస్తకంలోని విశేషాల గురించి తెలుసుకుంటే 2001లో నేను జపాన్ పర్యటనకు వెళ్లినప్పటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. టోక్యోలోని భారత హై కమిషనర్ కార్యాలయంలోని నా సన్నిహితుల ద్వారా రెంకోజీ టెంపుల్ లోని నేతాజీ ఆనవాళ్లను, అక్కడి స్మారకాన్ని దర్శించాను. విజిటర్స్ బుక్ లో.. రెంకోజీ టెంపుల్ ను సందర్శించినప్పుడు అటల్ బిహారీ వాజపేయి తను సుభాష్ చంద్ర బోస్ నుంచి పొందిన స్ఫూర్తిని చెబుతూ రాసిన అభిప్రాయం చదివాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన ‘సిద్ధాంతం కోసం ఒక మనిషి తన ప్రాణాన్ని కోల్పోవచ్చు. అయితే, ఆ సిద్ధాంతం.. అతడి మరణం తర్వాత వేలాది మందిలో స్ఫూర్తి నింపుతుంది. కోట్లాది మంది ప్రజానీకానికి మేలు చేస్తుంది’ అనే మాటలను ప్రతి ఒక్కరూ గుండెల్లో నింపుకోవాలి. అందుకు ఎమ్.వి.ఆర్.శాస్త్రి లాంటివారి నుంచి మరిన్ని రచనలు రావాలి అని అన్నారు.

నేతాజీ పుస్తక ఆవిష్కరణ కు పవన్ కళ్యాణ్ రాలేకపోవడం వలన జనసేన పార్టీ తరపున కార్యక్రమానికి ప్రతినిధులుగా బొలిశెట్టి సత్యనారాయణ, ఏ.వి రత్నం హాజరవడం జరిగింది.