జనసేన భావజాలంతో గెలిచిన అభ్యర్థులకు శుభాభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో జనసేన పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పార్టీ కార్యాలయానికి అందుతున్న ఫలితాల వివరాలు సంతృప్తిని కలిగిస్తున్నాయి. హంగు, ఆర్భాటం, ధన బలం ప్రభావం లేకుండానే ఈ ఎన్నికలలో జనసైనికులు చూపుతున్న పోరాటపటిమ నన్ను ఆకట్టుకుంటోంది.

ఈ ఎన్నికలలో మనం చూపుతున్న ప్రభావం, ఫలితాలు రాబోయే విజయాలకు సంకేతాలుగా భావిస్తున్నాను. ఉరకలెత్తే ఉత్సాహంతో యువకులంతా నామినేషన్లు వేయడంతోనే మన ధ్యేయం సగం నెరవేరిందని భావించాను. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పక్షం ధన, బల ప్రయోగాలు… ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ చూస్తున్నారు. వీటిని తట్టుకొని గుండె ధైర్యంతో జనసేన భావజాలం, మద్దతుతో అభ్యర్థులు నిలిచారు. వారికి వెన్నుదన్నుగా పార్టీ శ్రేణులు ఉన్నాయి.

మన విజయాల గురించి మనకు మనమే ప్రచార సాధనాలు కావాలి.  మన విజయాలను తక్కువ చేసి చూపే వారి గురించి ఆలోచించకండి. మన లక్ష్యం వైపే గురి నిలపండి. ఈ ఎన్నికలలో జనసేన భావజాలంతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, జనసేన జెండాను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లిన జనసైనికులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తిని మలి దశ ఎన్నికలలోనూ కొనసాగించాలని కోరుకుంటున్నాను- మీ పవన్ కళ్యాణ్.