17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ

ఈ నెల 17న గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిన్న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విలేకరుల సమావేశంలో వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలపై సమావేశంలో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు.

గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్‌లో ఓ సభను పెట్టాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై మహేశ్ కుమార్ విమర్శలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న దానికి ఇది నిదర్శనమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం కేసీఆర్‌లో కనిపిస్తోందని మహేశ్‌కుమార్ అన్నారు.