సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. లాక్ డౌన్ కారణంగా ప్లాన్‌ ఫెయిల్

హర్యానా‌లో సల్మాన్ ఖాన్ హత్యకు  కుట్ర పన్నిన ఓ షార్ట్ షూటర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన ఓ షార్ప్ షూటర్‌ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ షార్ప్ షూటర్‌ని విచారిస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నిన కోణం బయటపడింది. అతడి నెక్ట్స్ హిట్ లిస్టులో ఉంది సల్మాన్ ఖానేనని తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతేకాకుండా సదరు షార్ప్ షూటర్ ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంట్ వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. జనవరిలోనే ముంబైకి చేరుకున్న షార్ప్ షూటర్.. రెండు రోజుల పాటు బాంద్రాలోనే ఉండి సల్మాన్ ఖాన్ కదలికలపై నిఘా పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఫరిదాబాద్ డీసిపి వెల్లడించిన వివరాల ప్రకారం సల్మాన్ ఖాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన షార్ప్ షూటర్ రాహుల్ తాను రెక్కి పూర్తి చేసిన అనంతరం రెక్కిలో కనుగొన్న విషయాలను బిష్ణోయ్‌కి  చేరవేశాడు. ఐతే అనుకోకుండా కరోనావైరస్ వ్యాపించడం మొదలైన అనంతరం లాక్ డౌన్ విధించడంతో ఆ ప్లాన్‌ని అమలు చేయలేకపోయారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరగడం ఇదేం తొలిసారి కాదు. 2018లోనూ ఇదే గ్యాంగ్‌కి చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్.. సల్మాన్‌ని హత్య చేసేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ కూడా పూర్తి చేశాడు. కానీ అనుకోకుండా సంపత్ నెహ్రా అరెస్ట్ అవడంతో అతడి ప్లాన్ వర్కౌట్ అవలేదు.