ఏడుపాయల ఆలయంలో కరోనా కలకలం.. వారం పాటు ఆలయం మూసివేత

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో మళ్ళీ షరతులు విధిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో అనేక జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటు గుజరాత్ లో కూడా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఢిల్లీలో సైతం ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసులు క్రమంగా పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ ఈవోకు కరోనా సోకింది. దీంతో ఆలయంలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతవారం ఆలయంలో జాతర జరిగింది. ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవోకు కరోనా సోకడంతో ముందస్తు జాగ్రత్తగా ఆలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆలయంలో యధావిధిగా కైంకర్యాలు జరుగుతాయని, భక్తులకు అనుమతి ఉండదని ఆలయ అధికారులు పేర్కొన్నారు.