బీఆర్కే భవన్‌లో కరోనా టెర్రర్‌.. 61 మందికి వైరస్!

తాత్కాలిక సచివాలయం (బీఆర్కే భవన్‌)లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా 61 మంది ఉద్యోగులు, అధికారులువైరస్‌ బారినపడ్డారు. తొలి వేవ్‌ కన్నా సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో సచివాలయంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కరోనా బారిన పడి.. కోలుకొని విధులకు హాజరవుతుండగా ఆయన పేషీలోని పలువురు ఉద్యోగులకూ పాజిటివ్‌ వచ్చింది. ఇక వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి కూడా వైరస్‌ సోకింది. ఏపీ సచివాలయంలో ఉద్యోగులు వైరస్‌ బారిన పడి దాదాపు రోజుకొకరు చనిపోతుండడంతో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

సాధారణ పరిపాలన శాఖలో 12 మంది, నీటిపారుదల శాఖలో ఏడుగురు, ఆర్థిక శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, అటవీ, గిరిజన సంక్షేమశాఖలో నలుగురు చొప్పున, వైద్యారోగ్యశాఖలో ఐదుగురు, రెవెన్యూ శాఖలో ముగ్గురు, పాఠశాల విద్యలో ఒకరు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఐదుగురు, పురపాలకశాఖలో ముగ్గురు, రోడ్లు భవనాల శాఖలో ఒకరు కలిపి మొత్తం 61 మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో ఉద్యోగ జేఏసీ కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు పట్టుబడుతోంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు కూడా సీఎం కార్యాలయానికి సోమవారం వినతిపత్రం పంపారు. రోజూ 50 శాతం మంది ఉద్యోగులనే విధులకు అనుమతించాలని, సచివాలయంలోని డిస్పెన్సరీలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని, పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులకు 15 రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్‌ లీవు సౌకర్యంతో పాటు కరోనా చికిత్సకు రీయింబర్స్‌మెంట్‌ను రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచాలని కోరారు.