రాజశేఖర్‌ కుటుంబoలో అందరికి కరోనా

టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన ఇంట్లో అందరికీ కరోనా సోకినట్టు తెలుస్తోంది. రాజశేఖర్, భార్య జీవితా, పిల్లలు శివాని, శివాత్మిక అందరూ కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే వీరిలో శివాని, శివాత్మిక కోలుకున్నారు.

జీవిత, రాజశేఖర్‌లు మాత్రం ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. త్వరలోనే తాము కూడా కరోనా నుంచి కోటుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని రాజశేఖర్ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘నాకు, జీవితకు, మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందన్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరు కుమార్తెలు పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత కాస్త అనారోగ్యంతో ఉన్నాం. త్వరలోనే ఇంటికి చేరుకుంటాం… ధన్యవాదాలు’ అని రాజశేఖర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఫాలోవర్స్‌ వరుస కామెంట్లు చేశారు. ‘త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం..’ అని పేర్కొన్నారు.

‘గరుడవేగ’ సినిమా నుంచి రాజశేఖర్‌ బిజీగా ఉన్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ‘అర్జున్‌’ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మరియం జకారియా నటించారు. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.