జనవరి 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం

సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం 2022, జనవరి 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో జరుగుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఆ సమావేశాల్లో దేశ రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీ వ్యూహాన్ని రూపొందిస్తామని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్‌ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో రాఘవులు మాట్లాడుతూ కేంద్రకమిటీ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాల గురించి చర్చించామని అన్నారు. ఈనెల 13,14 తేదీల్లో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రమాదకరమైన ప్రజావ్యతిరేక విధానాలను, రాష్ట్రాల హక్కులను కాలరాసే పోకడలను చర్చించామని చెప్పారు. వాటికి వ్యతిరేకంగా తక్షణం పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలను నామమాత్రంగా కేంద్రం తగ్గించిందని విమర్శించారు. రాష్ట్రాలకు వాటా రాని పద్ధతిలో కేంద్రం పన్నులను వసూలు చేస్తూ ఆదాయాలను కొల్లగొడుతుందన్నారు. కానీ రాష్ట్రాల మీద నెపం నెట్టేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను అందరం వ్యతిరేకించాలని కోరారు. కేంద్రం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నులను రద్దు చేసి పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాలని కోరుతూ విశాలమైన ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు.

వడ్లు కొనేందుకు కేంద్రం కుంటిసాకులు..
వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని రాఘవులు విమర్శించారు. కేంద్రానికి ఎక్కువగా ధాన్యం అందించే రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. ఈ విధానం వల్ల తెలంగాణ ఇబ్బందిపాలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ఎఫ్‌సిఐ ద్వారా కేంద్రం కొనాలని ఆయన డిమాండ్‌ చేశారు. గోదాముల్లో మూలుగుతున్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. కోవిడ్‌ సందర్భంగా సరఫరా చేస్తున్న అదనపు బియ్యాన్ని ఈనెల నుంచి ఇవ్వడం లేదనీ, దాన్ని కొనసాగించాలని కోరారు. మైనార్టీలపై పెరుగుతున్న దాడులను ఖండించారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అక్ర మాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రైతు పోరాటానికి, ప్రయివేటీకరణ, మానిటైజేషన్‌కు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.

అలా అయితే టిఆర్‌ఎస్‌కు నిజాయితీ లేనట్టే..
హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత బిజెపి విధానాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విమర్శల మోతాదును పెంచారని రాఘవులు చెప్పారు. విమర్శల మోతాదును పెంచడం ఆహ్వానించదగినదేనని అన్నారు. అయినా ఇది తాత్కాలిక ఆక్రోశం నుంచి జరిగిందా? బిజెపి మతోన్మాద ప్రమాదాన్ని, ఫెడరల్‌ వ్యవస్థకు జరుగుతున్న హానిని అర్థం చేసుకుని నికరంగా వ్యతిరేకిస్తున్నారా?అన్నది స్పష్టం కావాలన్నారు. అలా లేదంటే బిజెపి పట్ల టిఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న తీరు దోబూచులాట తప్ప నిజాయితీతో చేస్తున్నదిగా ప్రజలు భావించబోరన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల ప్రయోజనాలకు చేస్తున్న హానిని గుర్తించి టిఆర్‌ఎస్‌, వైసిపి నిక్కచ్చిగా ఎదిరించాలని కోరారు.