సంపద సృష్టించి సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం

  • అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం
  • బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి, అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంతో యువనేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తో పాటు గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో చంద్రబాబునాయుడు సున్నాతో పాలన ప్రారంభించారని, గత అయిదేళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా 30ఏళ్లు వెనక్కివెళ్లిందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందని, చంద్రబాబు ఆలోచనల మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా రెండున్నర రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయాం. అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయి.

ఒకేరాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం

పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. చంద్రబాబు మొదలుపెట్టిన పనులు కొనసాగించి ఉంటే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. రెండు నెలలు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం.

ప్రతిపక్షనేతలను తిట్టేవారికే వైసిపి టిక్కెట్లు!

భావప్రకటన స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాలరాసింది. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించిన మహిళలపై పేటిఎం బ్యాచ్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు, వారిపై ఎలాంటి చర్యలు లేవు. నా తల్లిని కూడా అవమానించారు. మహిళలను గౌరవించే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం. చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా నారాయణస్వామి అసభ్య పదజాలంతో అవమానిస్తే ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. పైగా ప్రతిపక్షనేతలను బాగా తిడితేనే టిక్కెట్లు ఇస్తామని జగన్ నిస్సిగ్గుగా ఆ పార్టీవారికి చెబుతున్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే ప్రజలు బుద్దిచెప్పాల్సి ఉంది. వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం చేశారు. ఇవాళ ఆయన సొంత కూతురే వివేకాను ఎవరు చంపారో వెల్లడించారని అన్నారు.