వివాదంలో క్రికెటర్ బయోపిక్.. స్పందించిన ముత్తయ్య

శ్రీలంక లెజండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై కోలీవుడ్‌లో ‘800’ అనే మూవీ తెరకెక్కుతోంది. మక్కన్ సెల్వన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో మురళీధరన్‌గా టైటిల్ రోల్‌లో కనిపించనున్నాడు. అయితే ముత్తయ్య బయోపిక్‌లో నటించొద్దంటూ విజయ్ సేతుపతికి భారతీరాజాతో పాటు పలువురు సూచించారు. పలు తమిళ సంఘాలు దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈచిత్రం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు.

నేను శ్రీలంకలో పుట్టిన తమిళవాడిని,అక్కడ పుట్టడం నా తప్పా. చిన్నప్పటి నుండి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న నేను చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అలాంటి ప్రాంతంలో మనుగడ సాధించి ఇంతవాడిని అయ్యాను. 2009లో జరిగిన విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని నన్ను ఇప్పటికీ ఇబ్బందులకి గురి చేస్తున్నారు. యుద్ధం ముగిసిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా జీవనం గడపాలి అనుకుంటున్నానని అందరిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికే ఈ సినిమాకు అంగీకంరించాను అని ముత్తయ్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా నటి రాధిక శరత్ కుమార్ ఈ వివాదంపై స్పందిస్తూ.. జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు.