పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సహించేది లేదు

  • ఎమ్మెల్యే గారూ…నియోజకవర్గ అభివృద్ధిపై ముందు దృష్టి సారించండి
  • జనసేన నేతలు

ఘంటసాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సహించేది లేదని ఆ పార్టీ నేతలు అన్నారు. మండల పరిధిలోని యందకుదురు గ్రామంలో జరిగిన సమావేశంలో ఎంపిటిసి సభ్యులు సిద్ధినేని కుమార్ రాజా, జనసేన నేతలు మాట్లాడుతూ ఇటీవల ఘంటసాలలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై విమర్శలు చేయటం సబబు కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముందు దృష్టిసారించాలని, మౌళిక సదుపాయాల మాట మరిచి సంక్షేమం అనే ఒక మూసలో యావత్ ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులమయం చేసిందన్నారు. అసలు ప్రత్యర్థి పార్టీ గురించి మాట్లాడటానికి మీకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పారిశ్రామికీకరణ, టూరిజం మెరుగుపరిచే అవకాశాలు ఉన్నప్పటికీ వాటి ఊసే మీకు తెలియదని విమర్శించారు. రైతు బిడ్డ అయ్యి ఉండి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అని తెలిసి ఉండి మీరు కల్పించిన మౌళిక సదుపాయాల మాట ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు వారికున్న కష్టనష్టాలను చెబితే పట్టించుకోకుండా ఎదురుదాడికి దిగటం హాస్యాస్పదమన్నారు. నిస్వార్థంగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అవాకులు, చవాకులు, చలోక్తులతో మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఎప్పుడు ఒక వైపే ఉంటాయనుకోవటం భ్రమ అని గుర్తుంచుకోవాలన్నారు. వ్యవసాయానికి అవసరమైన సాగునీటి వ్యవస్థ ఒకప్పుడు ఏలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, ప్రధాన కాలువల మీద కూడ డీజిల్ ఇంజన్లు పెట్టాల్సిన ఆవశ్యకత వస్తుందని పేర్కొన్నారు. పండిన పంటను మార్కెట్ చేసుకోవటానికి రవాణా వ్యవస్థ ఏలా ఉంది, గిట్టుబాటు ధర వస్తుందా, సకాలంలో పండించిన పంటకు డబ్బులు ఇప్పించగల్గుతున్నామా అని ప్రశ్నించుకుంటే మంచిదన్నారు. స్వశక్తి సంపాదనను తుంగలో తొక్కి మీరు ఇచ్చే సంక్షేమంతో అద్భుతాలు సృష్టిస్తున్నామనే మాయ మాటల్ని చెప్పుకుంటూ గడప గడపకు తిరగటం ఎంతవరకు భావ్యమో మీరే ఆలోచించుకోవాలన్నారు. రాజకీయ ప్రసంగాలు ఎన్ని చేసినా గౌరవంగా ఉంటుందే తప్ప మీడియా ప్రగల్భాలు పలకటం ఎంత మాత్రమూ గౌరవం అనిపించుకోదన్నారు. ఇప్పటికైనా ప్రజా ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టి అప్పుడు మాట్లాడితే హర్షిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ప్రత్తిపాటి అనిల్ కుమార్, సిద్ధినేని సాయి కృష్ణ, చింతల సాయి మనీష్, సిద్ధినేని నితిన్, బండి సురేష్ తుంగల నవీన్, బొప్పన నరేష్, కొట్టి వీరబాబు, బోనం పవన్ కుమార్ లు పాల్గొన్నారు.