పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తే సహించేది లేదు: గురాన అయ్యలు

విజయనగరం: వైకాపా మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ యోగ్యత మరచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను పవన్‌ కళ్యాణ్‌ లేవనెత్తితే వైకాపా ప్రజాప్రతినిధులు మితిమీరి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ముఖ్యంగా బందర్‌ నాని సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే అర్హత నానికి లేదన్నారు. రాజకీయాలకు రాక ముందు నుంచే పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన విలువైన సమయాన్ని, ధనాన్ని ఖర్చు చేస్తూ, కులాలకు, మతాలకు అతీతంగా నిస్వార్ధమైన రాజకీయం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కాపు నాయకులతో విమర్శలు చేయించడం సిగ్గుచేటన్నారు. కాపులంతా వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజలకు పాలేరుగా పనిచేయాలని, అలా కాకుండా అవినీతిపరుడైన జగన్మోహన్‌రెడ్డికి ఊడిగం చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రి బొత్స రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా డ్యాన్సులు వేసే వ్యక్తి అవసరమా అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో సినిమాల్లో డ్యాన్సులు చేస్తూ, రంగులు వేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించి, పాలనలో మార్పులు తీసుకువచ్చిన సంగతి బొత్స గుర్తుంచుకోవాలన్నారు. అవినీతిపరుడు, దుర్మార్గుడైన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకు మాట్లాడాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.