ఉద్యోగాల భర్తీపై సంక్షేమశాఖల అధికారులతో సీఎస్‌ భేటీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఉన్నతాధికారుల ఈ సమావేశానికి హాజరుకానున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు తెలసుకోనున్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలతోపాటు ఇంజినీరింగ్‌ విభాగం, కార్పొరేషన్లు, సహకార సంస్థల్లో ఖాళీల వివరాలపై చర్చించే అవకాశం ఉన్నది.

కాగా, సంక్షేమ శాఖలు ఇప్పటికే ఖాళీల గుర్తింపు ప్రక్రియను చేపట్టాయి. ఇందులో భాగంగా సంక్షేమ శాఖలో 12 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉన్నది. గురుకులాల్లో అత్యధికంగా 8 వేల ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. సీఎస్‌తో సమావేశం నేపథ్యంలో సబార్డినేట్‌ పోస్టుల ఖాళీలతోపాటు అన్నింటి వివరాలు సేకరించి ఆయా శాఖల అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు.