నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ.. మినహాయింపు ఇవే!

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి (బుధవారం) మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతిచ్చారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మధ్యాహ్నం 12 తరువాత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విధించింది. ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి పగటిపూట కర్ఫ్యూ కూడా అమలవుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపింది. వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లే పేషెంట్ లకి అనుమతి ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లేవారికి అనుమతినిచ్చారు.

ఇక, ఆర్టీసీ బస్సులకు సంబంధించి.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌ లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం లేదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఆయా జిల్లాల పరిధిలోని, పక్క జిల్లాలకు వెళ్లే సర్వీసులనే ఆర్టీసీ నడపనుంది. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌ కు సర్వీసులు ఆపేశారు. దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని అధికారులు తెలిపారు.