‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు సీవీఎల్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ… అప్పుడే హడావుడి మొదలైంది. తాము అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ, మంచు విష్ణులు ఇప్పటికే ప్రకటించారు. పలువురు ఇప్పటికే ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు.

ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న వారి జాబితాలో తాజాగా మరో పేరు చేరింది. తాను కూడా బరిలో నిలుస్తున్నట్టు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. మా అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలా తాను కృషి చేస్తానని చెప్పారు.

మరోవైపు మంచు విష్ణు ఓ లేఖను విడుదల చేశారు. తన తండ్రి మోహన్ బాబు మా అధ్యక్షుడిగా పని చేశారని… ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు తనకు మార్గదర్శకాలని లేఖలో విష్ణు తెలిపారు. మా సభ్యులకు ఏది అవసరమనే విషయంపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కష్టాల్లో ఉన్న కళాకారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.