దర్జాగా దేవుని బంధ కబ్జా …!

  • యంత్రాలతో చదును చేస్తుంటే యంత్రాంగం ఏం చేస్తున్నట్లు …?
    జిల్లా ఏర్పడ్డాక పెరిగిన కబ్జాలు
  • కబ్జాలను అరికట్టడంలో యంత్రాంగం జిల్లా విఫలం
  • కబ్జాను అడ్డుకోకపోతే కబ్జాలపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం
  • కబ్జాకు గురైన దేవుని బంధను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న దేవుని బంధ దర్జాగా కబ్జాకు గురవుతోందని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చెందక అనిల్ కుమార్, గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, నెయ్యగాపుల సురేష్, సిరిపురం గౌరీ శంకర్, మానేపల్లి ప్రవీణ్ తదితరులు మున్సిపాలిటీలోని తూర్పు వీధి సమీపంలో ఉన్న కబ్జాకు గురవుతున్న దేవుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సర్వే నెంబరు 343 లోని 4.96 ఎకరాల విస్తీర్ణం కలిగిన దేవుని బంధ దర్జాగా కబ్జాలకు గురవుతుందన్నారు. ఇప్పటికే చెరువులో కొంతమంది అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టగా, మరి కొంతమంది మట్టిని పోసి కబ్జాకు పాల్పడ్డారన్నారు. తాజాగా గత ఒకటి రెండు రోజుల్లో యంత్రాలతో దేవుని బంధను చదును చేసి కబ్జాకు పాల్పడుతుంటే సంబంధిత యంత్రాంగం ఏం చేస్తోందని అని ప్రశ్నించారు. జిల్లా ఏర్పడ్డాక పార్వతీపురం జిల్లాలో కబ్జాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ స్థలాలను, చెరువులను, బందులను గెడ్డలను అధికంగా అక్రమార్కులు కబ్జా చేస్తున్నారన్నారు. వాటిని నివారించడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తుందన్నారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా కలెక్టరుకు, తాసిల్దార్ కు, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే కబ్జా రాయళ్ల వెనుక అధికారి యంత్రాంగం హస్తమున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పట్టణం నడిబొడ్డున యంత్రాలతో దేవుని బంధను చదును చేసి కబ్జా చేస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సచివాలయం తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దేవుని బంధను రక్షించాలని, కబ్జాకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. జనసేన పార్టీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు పాల్గొన్నారు.