7వ రోజు పాటంశెట్టి ఆమరణ నిరాహార దీక్ష

  • కల్లబొల్లి మాటలతో దీక్ష విరమింప చేయాలనుకుంటున్న ప్రభుత్వం

జగ్గంపేట నియోజకవర్గం: రైతులకు న్యాయం జరగాలని 7వ రోజుకు చేరుకున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు పెద్దాపురం ఆర్డీఓ, డిఎస్పీ, అగ్రికల్చర్ జేడీ, జగ్గంపేట ఎమ్మార్వో, సిఐ దీక్షా శిబిరానికి వచ్చి సూర్యచంద్రతో చర్చలు జరిపారు. ఈ చర్చలో పెద్దాపురం ఆర్డీఓ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు మీ చేత నిరాహార దీక్ష విరమింప చేయడానికి మేము ఇక్కడకు వచ్చామని మీ డిమాండ్లను మాకు చెబితే మేము పరిశీలిస్తాము, మీ ఆరోగ్య పరిస్తితి క్షీణిస్తుంది కాబట్టి మీరు దీక్ష విరమిస్తే బాగుంటుందని కోరారు. ఒక వేళ మీ డిమాండ్లు మా వలన పరిష్కారం కానీ పక్షంలో జాప్యం చేయకుండా మా పై అధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గత 7 రోజులుగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తాళ్లూరు పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీరు రాక పొలాలు ఎండిపోయి నష్టాలు పాలైన రైతుల తరపున నిలబడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేను రైతులందరీ పక్షాన కోరుతున్న విన్నపాలు ఏమిటంటే, తాళ్లూరు పంపింగ్ స్కీమ్ ఆయకట్టులో ఎండిపోయిన పొలాలు అన్ని జిల్లా కలెక్టరు గారు తక్షణమే వచ్చి భౌతికంగా పరిశీలించి, పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందివ్వాలి. దీన స్థితిలో ఉన్న తాళ్లూరు 2వ దశ ఎత్తిపోతల పథకానికి శాశ్వత మరమ్మతులకు నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి అని కోరారు. దానికి ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ డిమాండ్లను అన్ని కూడా జిల్లా కలెక్టరు గారి దృష్టికి తీసుకుని వెళ్లి తద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులకు నష్ట పరిహారం మరియు తాళ్లూరు పంపింగ్ స్కీమ్ కి మరమ్మత్తుల నిమిత్తం విడుదల అయ్యేలా చేస్తామని చెప్పారు. తర్వాత రైతులంతా మాట్లాడుతూ మా రైతులందరికి నిస్వార్థంతో కష్టపడి పని చేసి పంటలు పండించి ప్రజలందరి కడుపులు నింపడమే తెలుసుకానీ కరువులు ఏర్పడి, కాలువల ద్వారా సాగునీరు రాక ఎండిపోయిన పంటలను చూస్తూ బాధపడుతూ ఏమి చేయలేక దీన స్థితిలో, దిక్కు తోచక ఏదో పురుగుల మందు, తాగో లేదా చెట్టుకు ఉరేసుకునో చనిపోవడం తప్ప వేరే ఏమీ చేయలేని పిరికివాళ్ళము. అలాంటిది మాలాంటి వాళ్ళందరి భాదను చూసి చలించిపోయి మాలాంటి వారి కోసం సూర్యచంద్ర తన ప్రాణాలకు తెగించి మరి ఈ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దయచేసి కలెక్టరు గారు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారుల మానవతా దృక్పథంతో ఆలోచించి ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష మాలాంటి ఎంతో మంది నిర్భాగ్యులకోసం అని పరిగణలోకి తీసుకుని దయచేసి ఆ భార్యా, భర్తల ఇద్దరిపైన పెట్టిన కేసులన్నీ ఏటువంటి ఆంక్షలు లేకుండా ఎత్తి వేయాలని కోరారు.