దేవాదాయ శాఖ షాపులు బహిరంగ వేలం వేయాలి..!!

  • మారు అద్దెలతో ప్రభుత్వాదాయానికి గండి
  • దేవుడు మాన్యాలు, భూములు, స్థలాలు, భవనాల అద్దెలు బహిర్గతం చేయాలి
  • ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని దేవాదాయ శాఖకు చెందిన షాపులు బహిరంగ వేలం వేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ తో ఆ పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలినాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, సిరిపురపు గౌరీ శంకర్, మానేపల్లి ప్రవీణ్, జనసేన పార్టీ సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు తదితరులు దేవాదాయ శాఖ షాపులు అద్దె విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని దేవాలయాలకున్న షాపులు అద్దెకిచ్చే విషయంలో అంతర్గతంగా పలు అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మార్కెట్ రేట్ ప్రకారం ఆయా షాపులు అధిక ధరలు పలుకుతున్నప్పటికీ, కొంతమంది అతి తక్కువ ధరలకు చేజిక్కించుకొని, వాటిని వేరే వ్యక్తులకు అధిక ధరలకు మారు అద్దెలకు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. దీనివలన ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండిపడుతోందన్నారు. ముఖ్యంగా రాయగడ రోడ్డులో ఉన్న ఫ్రెండ్స్ షూ మార్ట్ పరిస్థితి ఇదే అన్నారు. దీంతోపాటు పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన షాపుల అద్దెల విషయంలో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లతోందన్నారు. కాబట్టి ఇకపై జిల్లాలోని దేవాదాయ శాఖకు చెందిన ప్రతి షాపు అద్దెకిచ్చే విషయంలో బహిరంగం వేలం వేయాలని కోరారు. అలాగే ఆయా దేవాలయాలకు చెందిన దేవుడు భూములు, మాన్యాలు, ఖాళీ స్థలాలు, షాపులు తదితర వాటి నుండి వచ్చే అద్దె వసూలు బహిర్గతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను పిఓ ఆదేశించారు.