డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన దీపిక

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎన్‌సీబీ ఎదుట హాజరవ్వగా.. శనివారం దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్‌, సారా అలీ ఖాన్‌లను విచారించనున్న నేపథ్యంలో నటి దీపికా పదుకొణె ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని పోర్ట్‌ ట్రస్ట్‌ అతిథిగృహంలో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. గోవాలో ఉన్న నటి భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి గురువారం ముంబయికి చేరుకున్నారు. శనివారం ఉదయం 9.45 గంటలకి ఆమె విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం అనంతరం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

డ్రగ్స్‌ కేసులో దీపికాకు ఎన్‌సీబీ అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఆమెతో సహా బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్లు శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లకు కూడా సమన్లు పంపారు. దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీని కూడా అధికారులు శుక్రవారం విచారించారు. శనివారం మరోసారి హాజరు కావాలంటూ కరిష్మా ప్రకాశ్‌కు సమన్లు పంపారు. శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లు కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నారు.