ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుడిని టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి: జనసేన డిమాండ్

  • దొంగల ముఠాలుగా ఏర్పడి తిరుమలను పంచుకుంటున్నారు

తిరుపతి, నూతనంగా ఏర్పాటు చేసిన టిటిడి పాలక మండలి బోర్డు సభ్యులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడుగా ఉన్న శరత్చంద్ర రెడ్డిని వెంటనే బోర్డు మెంబర్ పదవి నుండి తొలగించాలని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డిలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో వీరు మాట్లాడుతూ దొంగల ముఠాగా ఏర్పడి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని పంచుకునేందుకు రాష్ట్ర పాలకులు సిద్ధపడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని పలు జైళ్లను సందర్శించి, అందులో ప్రధానమైన నేరగాళ్ళని ఎంచుకుని టీటీడీ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఉందని విమర్శించారు. శ్రీవారి భక్తులు చిరుతల దాడిలో బలైపోతుంటే రక్షణ చర్యలు శూన్యమా అని ప్రశ్నించారు. హిందూ మతంపై భక్తి విశ్వాసాలు. రాష్ట్ర పాలకులకు లేవని ఎద్దేవా చేశారు. టీటీడీ పాలక మండలి నూతన సభ్యులలో ఉన్న శరత్చంద్రను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో అలిపిరి వద్ద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు రాజేష్ ఆచారి, మునస్వామి, కిషోర్, మనోజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.