ఆర్యన్‌ విడుదలకు రూ.25 కోట్ల డిమాండ్

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ కేసులో ఊహించని మలుపు! ఆర్యన్‌ను విడుదల చేయడానికి మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ)కు చెందిన ఓ అధికారితోపాటు మరికొందరు షారుక్‌ను రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. అందులో రూ.8 కోట్లను ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని వారు మాట్లాడుకుంటుండగా విన్నానని చెప్పారు.

వాంఖడే నేతృత్వంలో ఈ నెల 2న రాత్రి ముంబయిలోని ఓ రేవులో నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీపై ఎన్‌సీబీ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇందులో అరెస్టైన ఆర్యన్‌ జైల్లో ఉన్నాడు. ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9 మంది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్‌ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొచ్చాక శామ్‌ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, రూ.25 కోట్లు డిమాండ్‌ చేయాలని అతడికి చెబుతుండగా విన్నానని పేర్కొన్నారు. చివరకు రూ.18 కోట్లకు ఖరారు చేయమని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని కూడా డిసౌజాకు గోసావి చెప్పాడన్నారు. ఆ తర్వాత గోసావి, డిసౌజాలను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ కలిశారని చెప్పారు. గోసావికి ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలు ఇచ్చారని, అందులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నానన్నారు. తనతో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణభయంతో తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. 2018లో ఓ చీటింగ్‌ కేసుకు సంబంధించి గోసావి కోసం పుణె పోలీసులు ఇటీవల లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఎన్‌సీబీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ప్రభాకర్‌ ఈ ఆరోపణలు చేశారని ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున, ప్రభాకర్‌ తన వాంగ్మూలాన్ని న్యాయస్థానానికే తెలపాలన్నారు. మరోవైపు, వాంఖడే ప్రాణానికి హాని కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే కోరారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్‌ పాత్రపై ఎన్‌సీబీ వద్ద ఆధారాలున్నాయన్నారు.

నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర ముంబయి పోలీస్‌ కమిషనర్‌కు సమీర్‌ వాంఖడే లేఖ..

తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఆదివారం ముంబయి పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగరలేకు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని అందులో కోరారు. తనను జైలుకు పంపిస్తామని, ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తామని కొందరు పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు మీడియాలో హెచ్చరించారని అందులో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తుల పేర్లు లేఖలో ప్రస్తావించలేదు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ను కోరినట్లు చెప్పారు.షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.