రాజకీయ కక్షతో ఇప్పటం గ్రామస్థుల ఇళ్లు కూల్చడం దారుణం – చిరంజీవి

దర్శి, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే అక్కసుతో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రహదారుల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చడం దారుణమని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు, పడమర గంగవరం పంచాయతీ వార్డు సభ్యులు పసుపులేటి చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల్లో కనీసం గోతులు పూడ్చలేని ప్రభుత్వం బస్సు సౌకర్యం కూడా లేని ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగించిన అధికారులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పటం గ్రామస్థులకు అండగా ఉండేందుకు వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకోవడం శోచనీయమని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని, ఆయనను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. వైకాపా రాజకీయ కక్ష సాధింపులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చినట్లే, వైకాపా ప్రభుత్వాన్ని కూల్చే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ స్ఫూర్తితో ఇప్పటం గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు జనసైనికులంతా వారికి అండగా నిలుస్తామని చిరంజీవి తెలిపారు.