*మరో 10 సంస్థలకు భూకేటాయింపులు
అమరావతిలో అభివృద్ధికి గట్టు పడేలా మరో 10 సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో జరిగిన భూకేటాయింపుల సబ్‌కమిటీ 18వ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, గతంలో కేటాయించిన భూములపై సమీక్ష చేసి, అవసరమైన మార్పులు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు సంస్థలకు భూకేటాయింపుల్లో సవరణలు చేయగా, రెండు సంస్థలకిచ్చిన భూములను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీబీఐకి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌కు 3 ఎకరాల భూములు కేటాయిస్తూ గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశారు. అలాగే గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబిక అగర్‌బత్తీ సంస్థలకు చేసిన కేటాయింపులను రద్దు చేశారు. సోమవారం కొత్తగా ఐటీ డిపార్ట్మెంట్‌కు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో కు 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు 0.5 ఎకరాలు, బీజేపీ పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించామని మంత్రి తెలిపారు. 2014-19 మధ్య 130 సంస్థలకు 1270 ఎకరాలు కేటాయించగా, అప్పటి ప్రభుత్వ నిర్వాకం, మూడు రాజధానుల నిర్ణయాలతో అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపి తిరిగి భూకేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 64 సంస్థలకు 884 ఎకరాలు కేటాయించగా, ఈరోజు మరో 10 సంస్థలకు కేటాయింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. అమరావతిలో ఇప్పటికే 10,000 మందికి పైగా కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారని, వర్షాలు తగ్గిన తరువాత ఈ సంఖ్య 20,000కి చేరి పనులు వేగంగా కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Share this content:
Post Comment