మరో తెలుగు సినిమాలో ధనుశ్!

విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలతో ధనుశ్ దూసుకుపోతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు బాగానే ఫలించాయి. తమిళంతో పాటుగా తెలుగులోను తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకునే ధనుశ్, ఈ సారి నేరుగా తెలుగులో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది.

అయితే ధనుశ్ కి లైన్ మాత్రమే చెప్పి శేఖర్ కమ్ముల ఓకే అనిపించాడట. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది. అందువల్లనే ధనుశ్ మరో తెలుగు సినిమాను చేయడానికి అంగీకరించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఓ పెద్ద బ్యానర్లో నిర్మితం కానున్న ఈ సినిమా బాధ్యతను ఓ యంగ్ డైరెక్టర్ అప్పగించడం జరిగిందని అంటున్నారు. ముందుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.