అక్రమాలకు పాల్పడిన విఆర్ఓ రవికాంత్ పై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ధర్నా

*దళితులపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు విఆర్ఓ రవికాంత్ దళితులపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. చీపురు గూడెం దళితులు తుమ్మలపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నూజివీడు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవో రాజ్యా లక్ష్మికి మెమొరాండం సమర్పించారు.
ఈ ధర్నాకు జనసేన పార్టి అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ మద్దతు తెలిపి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు పూర్వకాలం నుండి సాగుచేస్తున్న భూముల విషయంలో జరిగిన అవక తవకలపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన విఆర్ఓ రవికాంత్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తుమ్మలపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తమ కుటుంబం పూర్వకాలం నుండి సాగుచేస్తున్న ఆర్ ఎస్ నెంబర్ 383లోని 2.71సెంట్లు భూమిని విఆర్ఓ రవికాంత్ అక్రమంగా రికార్డులు మార్చి కోటపాడు గ్రామానికి చెందిన వాసం కృష్ణయ్య, కొమ్ము కుటుంబ రావు, దుర్గయ్య, నాగేసు అనువారికి ఆన్లైన్ పాసుపుస్తకాలు ఇచ్చారని, అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం 2 కాలువ లో మా భూమి 0.33సెంట్లు ప్రభుత్వం సేకరిస్తే అందులో 0.13సెంట్ల భూమికి 2 లక్షల 40వేల రూపాయల నష్టపరిహారాన్ని కొమ్ము పుల్లయ్య అను వాని ఖాతాకు జమ చేయించారని, అదేమని అడిగితే పొరపాటు జరిగింది అంటూ.. మమ్ములను నానా ఇబ్బందులు పెడుతున్నారని వాపొయారు. అంతే కాకుండా మా భూమికి మా పేర్లు ఆన్లైన్ లో ఎప్పుడు నమోదు చేస్తారని నిలదీసిన మా పై తహశీల్దార్ అండతో విఆర్ఓ రవికాంత్ మరియు విఆర్ఎ సలీమ్ ను దౌర్జన్యం చేసి కొట్టామని చాట్రాయి పోలీస్ స్టేషన్లో 7గురుపై తప్పుడు కేసు పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పచ్చిమ కృష్ణ కార్యదర్శి దుర్గం పుల్లారావు, జనసేన చాట్రాయి మండలం అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, బాధితులు తుమ్మలపల్లి చిలకమ్మ, మంగమ్మ, టి రాంబాబు, అశోక్, చెన్ను శ్రీను, తొర్లపాటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.