పార్టీకి మచ్చ తెచ్చే పని చేయలేదు: ఈటెల

మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తాను అసైన్డ్, దేవాలయ భూములు ఆక్రమించినట్లు ప్రచారం జరుగుతోందని, అదంతా కుట్ర అని అన్నారు. ప్రజలంతా కూడా తనను అసహ్యించుకునేలా ప్రచారం చేశారని ఈటెల అన్నారు. 2002లో మెదక్ జిల్లాలో పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడనై మధుసూదనాచారి ఆధ్వర్యంలో పార్టీ లో చేరాను. 19 సంవత్సరాలు పని చేశాను. 2004లో కమలపూర్ లో గెలిచాను. పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారని ఈటెల అన్నారు. ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చారని.. 19 ఏళ్ల పాటు కేసీఆర్‌తో కలిసి పని చేశానని, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదని ఈటెల స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో అణిచివేతకు గురిచేశారని వివరించారు. ఒకవేళ తాను తప్పు చేశానని తేలితే శిక్షకు సిద్ధం అని తేల్చి చెప్పారు.

భూకబ్జా ఆరోపణలపై ఇప్పటివరకు తన వివరణ తీసుకోలేదని ఈటెల ఆరోపించారు. తనకు సంబంధం లేని భూములను అంటగడుతున్నారని, పోలీసులు భయానక వాతావరణం సృష్టించి భూములను సర్వే చేశారని ఈటెల విమర్శించారు. కేసీఆర్‌తో పరిచయం అయ్యాక ఒక్క పైసా కూడా వ్యాపారం చేయలేదని ఈటెల తెలిపారు. కనీసం భూములకు సంబంధించి ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదని ఈటెల స్పష్టం చేశారు. నోటీస్ ఇవ్వకుండా సర్వే చేసినందుకు కోర్టుకు వెళ్తానని ఈటెల చెప్పారు. ఈరోజు కేసీఆర్ చేతిలో రాజ్యం ఉండొచ్చని, కానీ రాజ్యాంగం అన్నది ఒకటి ఉందని గుర్తుంచుకోవాలన్నారు. అధికారులు సీఎం చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. మీ ఫాంహౌజ్ కు ఎన్ని అసైన్డ్ ల్యాండ్స్ తీసుకున్నారో తెలియదా అని ప్రశ్నించిన ఈటల. మీకు కూడా బిడ్డలున్నారు. మీ అధికారులు వావి వరుసలు లేకుండా రిపోర్ట్ రాస్తున్నారని, నా కొడుకును నా భార్యకు భర్తగా రాస్తారా. మీకు న్యాయమే అనిపిస్తుందా అని ప్రశ్నించారు. వ్యక్తులు ఇవాళ ఉంటారు, పోతారు అని.. కానీ ధర్మం అనేది ఉంటుందన్నారు. తనపై చేసిన భూ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఈటెల డిమాండ్ చేశారు.

కేసులు, కుట్రలు చేస్తే తాను భయపడే చిన్నవాడిని ఈటెల అన్నారు. నయీం లాంటి హంతక ముఠా తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే భయపడలేదని గుర్తు చేశారు. నిన్నే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చేశామని, ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తే తప్పకుండా ఫలితం అనుభవిస్తారని ఈటెల వ్యాఖ్యానించారు. అచ్చంపేట అసైన్డ్ ల్యాండ్ విషయంలో కోర్టుకు వెళ్తానని ఈటెల స్పష్టం చేశారు.