ముంబైలో నేటి సాయంత్రం నటుడు దిలీప్ కుమార్ అంత్యక్రియలు

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నేటి ఉదయం 7:30 గంటలకు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దిలీప్ కుమార్ తుదిశ్వాస విడవటం తెలిసిందే.

నేటి (జులై 7న) సాయంత్రం 5 గంటలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముంబైలోని జుహు శ్మశానవాటికలో దిలీప్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన భార్య, నటి సైరా బాను, కుటుంబసభ్యులు తెలిపారు. దిలీప్ కుమార్ భౌతికకాయాన్ని హిందూజ ఆసుపత్రి నుంచి ముంబైలోని ఆయన నివాసానికి తరలించారు. నటనలో సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డును 1994లో అందుకున్నారు. అంతకుముందు 1991లో పద్మభూషణ్, 2015లో భారత రెండో అత్యున్నత పౌర పుర్కారం పద్మ విభూషణ్‌తో కేంద్రం ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను సత్కరించింది.

1922 డిసెంబరు 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో దిలీప్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు యూసుఫ్ ఖాన్. దాదాపు ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్  సినీరంగానికి విశేష సేవలందించారు. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958)లో నటనకుగానూ ‘ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్’గా పేరు సంపాదించుకున్నారు. 1960లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఈయన జీవితంలో ఒక కీర్తి పతాకం. 1966లో నటి సైరా బానును వివాహమాడారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.