వైసీపీ సమాంతర వ్యవస్థతో శాంతిభద్రతలకు విఘాతం

• నవరత్నాల కోసం నియమిస్తే ప్రజల ప్రాణాలు తీస్తోంది
• కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతున్నారు
• వాలంటీర్ వ్యవస్థ కోసం ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కుతోంది
• రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి
• విశాఖను నేరాలకు అడ్డాగా మార్చిన వైసీపీ
• సొంత ఇంట్లో వారిని కాపాడుకోలేని అసమర్థ ఎంపీ
• దుష్టులు.. దుర్మార్గులను పెంచి పోషిస్తే ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు
• పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్

‘బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, పీకనులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడు. ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తరుక్కుపోతోంది. హత్య జరిగి పది రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఒక్క నాయకుడు కూడా పరామర్శకు రాలేదు అంటే వాళ్ల ఆలోచన విధానం ఏంటో అర్థమవుతుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పెందుర్తి సుజాతనగర్ లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన శ్రీమతి కోటగిరి వరలక్ష్మి గారి కుటుంబాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నేతలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “వైసీపీ ప్రభుత్వం తమ నవరత్నాల కోసం నియమించిన వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతున్నారు. వాళ్లు చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. బయటకు రాని నేరాలు చాలానే ఉన్నాయి. పాస్ పోర్టు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. వాలంటీర్ అనే ఈ సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదు? వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికొదిలి తయారు చేస్తోంది. ఇళ్లలోకి చొరబడి మరీ సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు..? వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో, క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నారు. ఇదొక దండుపాళ్యం బ్యాచ్ లా తయారైంది.
• వ్యవస్థలను సక్రమంగా పని చేయిస్తే నేరాలు జరగవు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు అని నేను మాట్లాడితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పింది నిజమని తేలింది. ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారు. ఇది నేను చెబుతున్నది కాదు… నోబుల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యర్థి గారు చెప్పారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో, మాయం అవుతున్న చిన్నారులు ఏమవుతున్నారో కూడా వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. చిన్న బిడ్డలు ఉన్న వారు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. విశాఖ ప్రశాంతమైన నగరం. క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉండేది. అలాంటి ప్రాంతంలోనే నేడు హ్యుమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉంది. బయటకు రావొద్దు, అభివాదం చేయొద్దు అని నాకు ఆంక్షలు విధిస్తారు. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. పోలీసులు వారి పని వారు చేస్తే సమాజంలో నేరాలు ఉండవు… కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చేతులు కట్టేస్తున్నారు. వారు చెప్పినట్లుగా పోలీసులు వినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయి. వ్యవస్థలను సక్రమంగా పని చేయనిస్తే నేరాలే జరగవు. వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడుకోవడమే జనసేన లక్ష్యం. చిన్న పిల్లలు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న చోట చుట్టు పక్కల వాళ్లు ఆ ఇంటికి ఎవరెవరు వస్తున్నారో అన్న దానిపై కన్నేసి ఉంచండి. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. స్టేషన్ కు వెళ్లలేకపోతే సోషల్ మీడియాలో అయినా వివరాలు పోస్టు చేయండి. అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలోని శాంత్రిభద్రతల సమస్యపై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షణ లేకుంటే ఉమ్మడిగా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పాలకపక్షంపై పోరాడాల్సిన సమయం ఇది.
• వైసీపీ నాయకులు రౌడీలతో మిలాఖత్ అయిపోయారు
విశాఖలో లా అండ్ అర్డర్ ఎంతలా దిగజారిపోయిందంటే ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయింది. డబ్బు కోసం ఎంపీ కొడుకు, భార్యను కిడ్నాప్ చేసిన రౌడీలనే ఎంపీ గారు వెనకేసుకొస్తారు. ఇంట్లో సొంత మహిళలపై దాడి చేసే వారిని వెనకేసుకొచ్చే నువ్వేమి ఎంపీవి? వైసీపీ నాయకులు, రౌడీలు మిలాఖత్ అయిపోయారు. దుర్మార్గులు, దుష్టులతో స్నేహం చేసి పోషిస్తే కచ్చితంగా ఏదో రోజు మీ ఇంటి ఆడవాళ్ల మీదకు వస్తారు. కొడుకును, భార్యను కిడ్నాప్ చేసిన రౌడీలకు ఎంపీ భయపడుతున్నారు. వారికి వత్తాసు పలుకుతున్నాడంటే ఎంపీ ఎంతటి అసమర్థుడో అర్ధం చేసుకోవచ్చు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి, అధికారంలోకి వస్తే ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది. ఓట్లు వేసే ముందు ప్రజలు ఒక్క సారి ఆలోచించాలి. ఒక ఎంపీ కుటుంబం మీదే దాడి జరిగితేనే దిక్కు మొక్కు లేదు. ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లా అండ్ అర్డర్ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నానాటికీ దిగజారిపోతున్న ఆంధ్ర పరిస్థితిని తప్పకుండా కేంద్రానిక తెలియజేస్తాం. హత్య చేసిన వాలంటీర్ కు శిక్ష పడే వరకు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులకు న్యాయపరమైన మద్దతు అందిస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్, పార్టీ నేతలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీమతి పి.ఉషాకిరణ్, శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు, శ్రీ పంచకర్ల సందీప్, శ్రీ వి.గంగులయ్య, శ్రీ మూగి శ్రీనివాస్, శ్రీ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.