‘కళామ్మతల్లి చేదోడు’ పేరుతో సినీ కార్మికులకు నిత్యవసరాల పంపిణీ

కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఒకవైపు కరోనా భయం, మరోవైపు చేతిలో పనిలేకపోవడంతో.. ఎందరో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అలాంటి కార్మికులను ఆదుకునేందుకు నిర్మాతలు దిల్ రాజు, చదలవాడ శ్రీనివాసరావు, యలమంచిలి రవిచంద్ ‘కళామ్మతల్లి చేదోడు’ అనే పేరుతో.. టాలీవుడ్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది సినీ కార్మికులకు రూ. 2500 విలువ గల నిత్యావసర సరుకులను అందించారు. యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు ప్రారంభించారు. నిత్యావసర సరుకులు అందుకున్న సినీ కార్మికులందరూ.. దాతలు చదలవాడ శ్రీనివాస రావు, దిల్ రాజ్‌లకు, అలాగే ఎంతో ప్లాన్‌గా కార్యక్రమాన్ని డిజైన్ చేసి విజయవంతం చేసిన యలమంచిలి రవిచంద్‌కు ధన్యవాదాలు తెలిపారు.