రైతుల కోసం జిల్లాకో పోలీస్‌స్టేషన్‌!

ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమలు, మహిళా పీఎస్‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

‘విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దిశ కార్యక్రమాలపై పోస్టర్లు ఉండాలి. రైతులకు రక్షణగా పోలీస్‌ వ్యవస్థ ఉండాలి. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్‌స్టేషన్‌ ఆలోచన చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు న్యాయం చేయడం కోసం వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. ప్రతీ పీఎస్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని’ సీఎం వివరించారు.