వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ఆస్తుల వివరాల నమోదు కోసం ధరణి యాప్, పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలు, ఆస్థుల నమోదుపై దాఖలైన పలు పిటిషన్లపై విచారరణ చేపట్టింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని.. కావున అప్పటివరకూ ఎలాంటి వివరాలను నమోదు చేయకూడదని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. ధరణిలో ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం కేవలం సాగు భూముల కోసం మాత్రమేనని.. ఏ చట్టం ఆధారంగా ఆధార్‌, కులం వివరాలను సేకరిస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్‌ పార్టీకి ఇవ్వొద్దని తెలిపింది. ధరణిలో ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. డేటా భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కౌంటర్‌ దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టును కోరారు. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.