లాక్ డౌన్ పొడిగించొద్దు – టి.సర్కార్ కు ఒవైసీ విజ్ఞప్తి

లాక్‌డౌన్‌ను పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. లాక్‌డౌన్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ ఎంత మాత్రం ఉపయోగకరంగా ఉండదని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా రద్దీని తగ్గించాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత కర్ఫ్యూ విధించాలని తెలంగాణ సీఎంఓకు అసద్‌ ట్వీట్ చేశారు. అవసరమనుకుంటే కోవిడ్ క్లస్టర్ ఏరియాల్లో మినీ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు. కేవలం నాలుగు గంటల పాటు సడలింపులు ఇచ్చి మూడున్నర కోట్ల రాష్ట్ర ప్రజలను లాక్‌డౌన్‌లో మగ్గేలా చేయడం సరికాదన్నారు అసదుద్దీన్.

కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి యూనివర్శల్ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లాక్‌డౌన్ పేదల పాలిట నరకంగా మారిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసుల వేధింపుల కారణంగా… ఆరోగ్య సంక్షోభం కాస్తా… శాంతి భద్రతల సమస్యగా మారుతుందని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి దీర్ఘకాలికంగా ఉంటుందన్న వాస్తవాన్ని అంగీకరించి…అందుకు తగ్గట్టుగా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలను చైతన్యపరిచి మాస్క్‌లు వాడడం, భౌతిక దూరం పాటించేలా చేయడం ఒక్కటే మార్గమన్నారు. తెలంగాణ కేబినెట్‌లో లాక్‌డౌన్ పొడిగిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు అసుద్దీన్ ఒవైసీ.