అలర్జీ ఉంటే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దు..

ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో యూకే ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి కరోనా వ్యాక్సిన్ కి ఆమోదం తెలిపి ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంగళవారం నుండి వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న నేషనల్ హెల్త్ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది.అలర్జీ ఉన్న వాళ్లు లేదంటే మెడిసిన్ తీసుకుంటే అలర్జీకి గురయ్యేవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవొద్దని సూచించింది. అలర్జీలు ఉండేవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సాధారణమే అని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకునేవారి మెడికల్ హిస్టరీ చూశాక టీకా ఇవ్వాలని సూచించింది.ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సర్వసాధారణమే. ఎందుైనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని చెప్పాము. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది అని సంబంధిత అధికారులు వెల్లడించారు.