2024 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము మంత్రి అమర్ కి ఉందా?

అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మండలంలో మంత్రి అమర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని అడిగిన అమర్ కు వచ్చే ఎన్నికల్లో తిరిగి అనకాపల్లి నుండే తాను పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు తాను ఆర్థికంగా చితికిపోయామని, ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని తన కుటుంబ సభ్యులంతా ప్రతి ఇంటికి తిరిగి వేడుకుని ఓట్లు వేయించుకొని గెలిచిన అమర్ కు తెలంగాణలో వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఖరీదైన భూములు కొనడానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని అంటున్నారంటే ఎన్ని కోట్లు వెనకేశారో చెప్పాలని అన్నారు. ఇప్పటివరకు అనకాపల్లి లో చేసిన అభివృద్ధిపై, నియోజకవర్గంలో యువతకి కల్పించిన ఉద్యోగం అవకాశాలపై, రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంత్రి అమర్ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అనుకుంటున్నారు అన్నారు. అనంతరం జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే యువశక్తి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.