ప్రాణాలు పోయేదాక పట్టించుకోరా?

  • గోతులమయంగా మారిన రోడ్ల దుస్థితిపై జనసేన ఆగ్రహం
  • తాత్కాలిక మరమ్మతులు ఇంకెన్నాలంటూ ప్రశ్నించిన జనసేన
  • దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించకపోతే ప్రజలతో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ఎప్పుడూ రద్దీగా ఉంటూ రోజుకి కొన్నివేల ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, కార్లు ప్రయాణించే లూదారం చర్చి జీ టీ రోడ్డు గోతులమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంభందిత అధికారులకు కానీ పాలకులకు కానీ చీమ కుట్టినట్లుగా కూడా లేదని, ఊహించని ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం జరిగితే కానీ పట్టించుకోరా అని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తాన్ దర్గా ఎదురు, దశరథరామయ్య పెట్రోల్ బంక్ పక్కన దెబ్బతిన్న రోడ్లను, రోడ్ల మధ్యలో ఏర్పడ్డ పెద్ద పెద్ద గోతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ నగరంలో గోతులమయంగా మారిన రోడ్లతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల మధ్యలో ఏర్పడ్డ గుంతలతో వాహనాలు పాడైపోతున్నాయని , ప్రయాణికుల వెన్నుపూస దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నగరం నడిబొడ్డులో నగరపాలక సంస్థకు కూతవేటు దూరంలో ఉన్న ప్రధాన రహదారి తీవ్రస్థాయిలో దెబ్బతిన్నా పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహించటం సిగ్గుచేటన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు నిలబడటంతో గోతులు కనపడక పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయారన్నారు. ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణించే రహదారి గోతులమయంగా మారితే అప్పటికప్పుడు ఒక ట్రాక్టర్ డస్ట్ పోయించి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతీరోజూ ఈ రహదారి మీదుగానే నగర మేయర్, నగరపాలక సంస్థ కమీషనర్, స్థానిక శాసనసభ్యులు ప్రయాణిస్తుంటారని, అయినా ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపడంలో మాత్రం ఎవరూ శ్రద్ధ చూపటం లేదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మాట్లాడితే నగర పరిధిలో ఐదు వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకునే పాలకులు ఈ రోడ్డుని నిర్మించటంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల దుస్థితిపై ఇప్పటికే జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా దున్నపోతుపై వాన పడ్డ చందాన వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని ధ్వజమెత్తారు. దెబ్బతిన్న రోడ్ల దుస్థితిపై ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి పెద్దఎత్తున విమర్శలు వచ్చిన ప్రతీసారి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి జులై 21 కల్లా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని ఆదేశాలు జారీ చేయడం ప్రహసనంగా మారిందన్నారు. ఇప్పటికి నాలుగు జులై 21లు కాలగర్భంలో కలిసిపోయినా గుంతలమయంగా మారిన రోడ్లు మాత్రం అలాగే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నగరంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాలని, ప్రాధాన్యత దృష్ట్యా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు. కార్యక్రమంలో 22వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నండూరి స్వామి, అలా కాసులు, సుభాని, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.