పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవా?!

  • రోజు కొళాయి నీరు పట్టే పట్టణ ప్రజల కల నెరవేరేనా?
  • అమ్మవారి పండగలో రోజు నీరిచ్చిన అధికారులు మిగతా రోజుల్లో ఎందుకు ఇవ్వలేరు?
  • నాలుగైదు రోజులకు కుళాయి వచ్చే దుస్థితి ఎక్కడైనా ఉందా?
  • స్వచ్ఛమైన నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవా..? అని జనసేన నాయకులు ప్రశ్నించారు. ఆదివారం జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా పార్వతీపురం పట్టణ ప్రజలు రోజు కొళాయి నీరు పెట్టే భాగ్యానికి నోచుకోలేదన్నారు. అది కలగానే మిగులుతుంది అన్నారు. నాలుగు రోజులు, ఐదు రోజులకు ఒకసారి వచ్చే కొళాయి నీటితో సరిపెట్టుకునే పరిస్థితి ఉందన్నారు. అది కూడా సమయపాలన లేకుండా నాలుగు బిందెలు నిండే సరికి కుళాయికట్టే పరిస్థితి ఉందన్నారు. ఇక వర్షాకాలం మొదలుకొని వేసవికాలం వరకు బురద నీటి సరఫరా సర్వసాధారణం అన్నారు. ఏళ్ళు గడుస్తున్నా ప్రజలకు అత్యవసరమైన తాగునీటిని అందించాలన్న ధ్యాస ఇటు పాలకులకు, అటు అధికారులకు లేకపోవడం ప్రజల దౌర్భాగ్యం అన్నారు. నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడిన పార్వతీపురానికి మౌలిక సదుపాయాల కష్టాలు తీరుతాయని ఆశపడిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. ఇటీవల జరిగిన గ్రామ దేవత అమ్మవారి పండగకు రోజు కుళాయిలు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా నీరు కలుషితమై టైఫాయిడ్, పచ్చకామెర్లు, డయేరియా తదితర రోగాలు ప్రజలను వేధిస్తున్నాయన్నారు. కుళాయిల్లో స్వచ్ఛమైన నీరు ఇస్తే ప్రజలు ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందన్నారు. కానీ ఇటు పాలకులు అటు అధికారులు ప్రజా ఆరోగ్యం పై దృష్టి సారించకుండా నాలుగైదు రోజులకు ఒకసారి కుళాయిలు ఇవ్వటం, అవి కూడా బురద నీరు ఇవ్వటం పరిపాటిగా మారిందన్నారు. జిల్లా అధికారుల సైతం దీనిపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరం అన్నారు. నాగావళి నదిలో పుష్కలంగా నీరు ఉండి, తోడేందుకు మోటార్ లు ఉండి, నిల్వ చేసేందుకు రిజర్వాయర్ లుండి, తాగేందుకు ప్రజలు కూడా ఉన్నప్పటికీ నీరిచ్చేందుకు మాత్రం పాలకలు, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది అన్నారు. కనీస అవసరమైన తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో పాలన ఉందని ఎద్దేవా చేశారు. కనీసం తాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేయకపోవడం అన్యాయం అన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాలకు పైపులైను వెయ్యలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోజు కుళాయి నీరు పట్టుకునే పట్టణ ప్రజల కలను నిజం చేయాలన్నారు. అలాగే బురద నీటికి బదులుగా స్వచ్ఛమైన నీటిని ఇవ్వాలన్నారు. దినసరి కూలి పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని సమయపాలన పాటించాలని కోరారు. అలాగే కుళాయి గోతుల బెడద తప్పేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. నాలుగైదు రోజులకు కుళాయిలు ఇచ్చే పరిస్థితి పార్వతీపురంలో తప్ప ఇంకెక్కడ లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.